
అమరావతి, 12 సెప్టెంబర్ (హి.స.)
భూముల సర్వే, దాని అనుబంధ సేవల్లో అనకాపల్లి జిల్లా బాగా వెనకబడింది. జిల్లా కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ శాఖ ఇచ్చిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
ఆర్ఓఆర్ సర్వేలో ప్రజా సంతృప్తి కోణంలో అనకాపల్లి, తిరుపతి, కడప జిల్లాలు కేవలం 65.5 శాతమే స్కోర్ నమోదు చేశాయని వెల్లడించింది. భూముల రీ సర్వేలో మార్కాపురం, అన్నమయ్య, కడప జిల్లాలు 73.6 శాతం స్కోర్ కనబరిచాయని, ఇది కూడా అతి తక్కువ పనితీరు జాబితాలోకే వస్తుందని పేర్కొంది. ఎఫ్-లైన్ పిటిషన్ల పరిష్కారంలో ప్రజాకోణంలో వెనకబడ్డ జిల్లాల్లో అనకాపల్లి ముందు వరసలో ఉంది. 74.3 శాతం స్కోర్తో అనకాపల్లి, అనంతపురం, అన్నమయ్య జిల్లాలు అసంతృప్తికర పనితీరు కనబరిచాయని రెవెన్యూ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
నిషేఽధిత భూముల జాబితా నుంచి ప్రజల భూములను తొలగించే పిటిషన్ల పరిష్కారంలో కర్నూలు, తిరుపతి, విశాఖ జిల్లాలు వెనకబడ్డాయి. కర్నూలు జిల్లాలో 238, తిరుపతిలో 215, విశాఖలో 204 దరఖాస్తులు పెండింగ్ ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత రెండేళ్ల వ్యవధిలో భూములకు నిషేధ విముక్తి కోరుతూ 15,775 పిటిషన్లు రాగా, అందులో 12,857 పరిష్కరించగా, 2,918 పెండింగ్లో ఉన్నట్లు సదస్సులో రెవెన్యూ శాఖ వివరాలను వెల్లడించింది. ఇందులో కర్నూలు, తిరుపతి, విశాఖ జిల్లాల పరిధిలోనే 657 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు నివేదించింది. జిల్లా కలెక్టర్లు తక్షణమే పెండింగ్ పిటిషన్లు పరిష్కరించాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) జి.జయలక్ష్మి సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ