
మహబూబ్నగర్, 12 సెప్టెంబర్ (హి.స.)
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను
విస్మరించి రైతులను, ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం కొత్తకోట చౌరస్తాలో పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దీక్షలో ఆమె పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తయిందని సంబరాలు చేసుకుంటోందని, అయితే ఈ వెయ్యి రోజుల్లో రైతులకు, సామాన్య ప్రజలకు చేసిందేమిటో చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్ నేతలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రూ.2 లక్షల రుణమాఫీని అర్హులైన ప్రతి రైతుకు అమలు చేయకుండా కొందరికే పరిమితం చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు.
రైతు భరోసా సకాలంలో అందక, పంటలకు అవసరమైన విద్యుత్ సరఫరా లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కొడంగల్కు విద్యుత్ సరఫరా చేస్తూ, ఇతర ప్రాంతాల రైతులకు ఎందుకు కోతలు విధిస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని డీకే అరుణ విమర్శించారు. నకిలీ విత్తనాలతో నష్టపోతున్న రైతుల కన్నీళ్లు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అనేక గ్రామాలకు బస్సులు సక్రమంగా నడవడం లేదని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాటలతో మభ్యపెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని విమర్శించారు. గతంలో కేసీఆర్ మాటలు ఎక్కువగా చెప్పారని, ఇప్పుడు రేవంత్రెడ్డి అంతకుమించి మాటలకే పరిమితమవుతున్నారని డీకే అరుణ ఎద్దేవా చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు