
హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.)
రాష్ట్రంలో గణేశ్ ఉత్సవాలను
ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించు కునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఉత్సవాల నిర్వహణ, బందోబస్తు. మౌలిక వసతుల కల్పనపై సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ప్రతినిధులు, నిర్వాహకులతో నేరుగా సమీక్షించే సంప్రదాయాన్ని పునర్దుద్ధరించామని, స్వయంగా సమస్యలు తెలుసుకునేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామని వెల్లడించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని సీఎం తెలిపారు. నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద ముందస్తుగా దరఖాస్తు చేసుకుని ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. మండపాల ఏర్పాటు సమాచారాన్ని స్థానిక కమీషనరేట్లకు అందించాలని, దీనివల్ల పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా, ఎలాంటి ఊహించని పరిణామాలు ఎదురైనా తక్షణ చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని స్పష్టం చేశారు.
అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మ ఉత్సవాలకు కల్పించినట్లే.. గణేశ్ నిమజ్జనాలకు కూడా నిర్మాణ దశలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనం కోసం చెరువుల చుట్టూ క్రేన్ల ఏర్పాటుకు వీలుగా చర్యలు ఉండాలన్నారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు మున్సిపల్, పోలీస్ శాఖలు నిరంతర పర్యవేక్షణ జరపాలని, కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ, సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. ఉత్సవాల నిర్వహణలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..