
హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.)
నగరంలోని మున్సిపల్
కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఇంటింటి చెత్త సేకరణను ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టాలనే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించు కోవాలని డిమాండ్ చేస్తూ స్వచ్ఛ ఆటో కార్మికులు శనివారం చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
గతంలో శాసనమండలిలో చెత్త సేకరణ ప్రైవేటీకరణపై మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కార్మికులు ఈ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. తమపై ఎలాంటి ప్రైవేట్ ఏజెన్సీల పెత్తనం అవసరం లేదని, దశాబ్దాలుగా నమ్ముకున్న ఉపాధిని దెబ్బతీయవద్దని స్పష్టం చేశారు.
చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీ వైపు దూసుకువచ్చిన కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్వచ్ఛ ఆటో కార్మికులు రోడ్డుపైనే బైఠాయించి, రవాణాను అడ్డుకున్నారు. కొందరు కార్మికులు రోడ్డుపై అడ్డంగా పడుకుని నిరసన తెలపగా, మరికొందరు అసెంబ్లీ ఆవరణలోకి వేళ్లేందుకు యత్నించారు.
ఆందోళనకారులను పోలీసులు తీవ్రంగా నిరోధించి, పలువురు కార్మికులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..