పోలీసుల విధి విధానాలపై కామారెడ్డి జిల్లా ఎస్పీ పవర్పాయింట్ ప్రజెంటేషన్
నిరసనలు, ఆందోళనల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు వ్యవహరించాల్సిన విధి విధానాలపై కామారెడ్డి జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిబ్బందికి అవగాహన కల్పించారు.
Sp


కామారెడ్డి, 12 సెప్టెంబర్ (హి.స.)

నిరసనలు, ఆందోళనల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు వ్యవహరించాల్సిన విధి విధానాలపై కామారెడ్డి జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిబ్బందికి అవగాహన కల్పించారు.

పోలీస్ శాఖలో హోంగార్డు స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు బందోబస్తు విధుల నిర్వహణ అత్యంత కీలకమైనదని, ముఖ్యంగా నిరసనలు, ఆందోళనల సమయంలో ప్రతి పోలీసు సిబ్బంది తమ విధుల పట్ల పూర్తి అవగాహనతో సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేసే హక్కును గౌరవిస్తూనే శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పరిస్థితులను సమర్థవంతంగా నియంత్రించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా చేయాల్సినవి, చేయకూడనివి అంశాలను సులభంగా అర్థమయ్యేలా వివరించారు. ప్రస్తుతం ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగం పెరిగిన నేపథ్యంలో పోలీసు సిబ్బంది మరింత అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మడం లేదా ప్రచారం చేయకుండా వృత్తి నైపుణ్యంతో వ్యవహరించాలని సూచించారు. అనంతరం సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. సిబ్బంది వ్యక్తం చేసిన అంశాలను ప్రస్తుత పరిస్థితుల్లో

విశ్లేషిస్తూ వాటి వల్ల పోలీస్ శాఖపై పడే అనుకూల, ప్రతికూల ప్రభావాలను వివరించారు. సిబ్బంది వ్యక్తిగత జీవితంలో కూడా జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్లు, ఆన్లైన్ గేమ్స్కు దూరంగా ఉండాలని సూచించారు. పిల్లల భవిష్యత్తు, కుటుంబ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని క్షణికమైన ఆశలు, ఆకర్షణలకు లోనై జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే నిర్ణయాలు తీసుకోవద్దని పిలుపునిచ్చారు. స్నేహితుడు బెట్టింగ్లకు బానిసవుతున్నట్లు గుర్తిస్తే నాకెందుకులే అని పక్కకు తప్పుకోకుండా ఆ ఊబి నుంచి బయటకు తీసుకురావాలని, అదే నిజమైన స్నేహమని తెలిపారు. ప్రతి పోలీసు సిబ్బంది ప్రజలతో మర్యాదగా, సంయమనంతో వ్యవహరిస్తూ చట్టబద్ధమైన విధానాలను పాటిస్తూ బందోబస్తు విధులను సమర్థవంతంగా నిర్వహించాలని ఎస్పీ సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande