
హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.)
ప్రభుత్వ భూములను పరిరక్షించడం మా బాధ్యత అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ధరణి పోర్టల్ అడ్డుపెట్టుకుని గత పాలకులు లక్షలాది ఎకరాలు చెరబట్టారని ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా వాళ్ల బండారం బయటపడుతుందని తప్పించుకు తిరుగుతున్నారని మండిపడ్డారు. 22-ఏ నిషేధిత భూముల అంశంపై ఇవాళ శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. చర్చను మంత్రి పొంగులేటి శ్రీనివాల్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. పోరాడి సాధించుకున్న తెలంగాణను స్వప్రయోజనాల కోసం వాడుకున్నారని పదేళ్లలో కేసీఆర్ కుటుంబం వాళ్ల బంధువులు మాత్రమే బాగుపడ్డారని విమర్శించారు. కేసీఆర్ రెండో సారి ప్రభుత్వంలో రెవెన్యూ శాఖను పూర్తిగా తనవద్దే ఉంచుకున్నారు. రెవెన్యూ శాఖను తనవద్దే ఉంచుకుని భూముల అక్రమాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు.
భూములు కొల్లగొట్టేందుకే ధరణిని వాడుకున్నారని రాష్ట్రంలోని 2.49 కోట్ల ఎకరాలను తమ సొంత ఆస్తిలా గత పాలకులు భావించారని ఆరోపించారు.
రెవెన్యూ శాఖలో బీఆర్ఎస్ చేసిన విధ్వంసం చిన్నది కాదని 55 మాడ్యూల్స్ తో ధరణిని తీసుకువచ్చి పేదలకు ఇబ్బంది పెట్టారన్నారు. భూములు ఆన్ లైన్ చేసే సమయంలో అనేక తప్పిదాలు జరిగాయన్నారు. ధరణి పోర్టల్ లో తప్పుల నమోదు వల్ల వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ధరణి పోర్టల్ కు లాక్ అనే సిస్టమ్ పెట్టి.. అందరి భూములపై నిఘా పెట్టారని ఒకరిద్దరు వీఆర్వోలు వాళ్ల మాట వినలేదని రాత్రికి రాత్రే వీఆర్వో, వీఆర్ఎ వ్యవస్థలను రద్దు చేశారన్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా వీఆర్వో, వీఆర్ఎలను రద్దు చేసి గ్రామ స్థాయిలో రెవెన్యూ పర్యవేక్షణ లేకుండా చేశారన్నారు. గతంలో కొత్త రెవెన్యూ చట్టం తెచ్చాక రెండున్నరేళ్లకు విధివిధానాలు తీసుకువచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అక్కడక్కడ రిజిస్ట్రేషన్ల సమస్య ఉన్న మాట వస్తావమేనని.. కానీ ధరణి చట్టాన్ని తెచ్చినప్పుడు 3 నెలల రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని అన్నారు. గత ప్రభుత్వంలో లక్షలాది అప్లికేషన్లు వస్తే సింపుల్ గా రిజెక్ట్ చేశారు. కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనూ ధరణితో ఇబ్బందులొచ్చాయన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు