
హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.)
వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలందరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని గాంధీ థీమ్ పార్క్ సర్కిల్లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పండుగ వెనుక ఓ మహోన్నత లక్ష్యం దాగి ఉంటుందని అన్నారు. ప్రకృతితో మమేకమవుతూ నేల, నీరు, చెట్టు, పుట్ట తదితర ప్రకృతి శక్తులను ఆరాధించడం భారతీయ సంస్కృతిలో భాగమని తెలిపారు.
ప్రతి ఏటా బల్దియా ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది సుమారు 600 మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని, వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో పాటు ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ జరుపుకోవాలని ఎమ్మెల్యే జీఎంఆర్ కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు