
హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.) హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ స్పష్టం చేశారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. హైదరాబాద్ ఎమ్మెల్యేలతో సిటీ డెవలప్మెంట్పై సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై గత ముఖ్యమంత్రిని కోరిన ఆయన సమావేశం పెట్టలేదని పెదవి విరిచారు.
సిటీ డెవలప్మెంట్లో ఎమ్మెల్యేలకు బాధ్యత ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.. ఎమ్మెల్యేలకే నియోజక వర్గ సమస్యలు తెలుస్తాయని అన్నారు. గ్లోబల్ సిటీ కావాలంటే ప్రతి డివిజన్ సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందన్నారు. సిటీలో రహదారులు చాలా వరకు డ్యామేజ్ ఉన్నాయని.. డ్రైనేజ్ సరిగా లేదు వాటి మీద కూడా దృష్టి పెట్టాల్సి ఉందని తెలిపారు. బస్తీల్లో సరఫరా అయ్యే మంచి నీటిలో డ్రైనేజ్ వాటర్ కలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ మూడు కార్పొరేషన్లు చేస్తున్నారని.. కానీ మంచి డెవలప్మెంట్ కావల్సి ఉందని పేర్కొన్నారు. ఈ మూడు కార్పొరేషన్లపై చర్చ జరగాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు ఏళ్ళు పూర్తయిందని.. ఇంకా 15 నెలల సమయం ఉందని గుర్తు చేశారు. ఈ 15 నెలల్లో మూసీ డెవలప్మెంట్ అవుతుందా..? అంటూ సందేహం వ్యక్తం చేశారు. ఈ వర్క్ నిదానంగా జరుగుతుందని అన్నారు. నగరంలో దోమల బెడద విపరీతంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
20 శాతం ప్రాపర్టీ టాక్స్ పెంచి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు విలువ ఉందో? లేదో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. గతంలో ఓ ఎమ్మెల్యే మీడియా ముందే అధికారులు విలువ ఇవ్వడం లేదని చెప్పారని గుర్తు చేశారు. అధికారులను రిక్వెస్ట్ చేసినా స్పందించడం లేదని ఎమ్మెల్యే రాజా సింగ్ వాపోయారు. పని చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ గ్లోబల్ సిటీ కావాలని చాలా ఏళ్లుగా ప్రజలు కోరుతున్నారని చెప్పారు. ప్రతి సారి గ్లోబల్ సిటీ అవుతుందని అంటున్నారు కానీ అది పేపర్ల వరకే పరిమితం అవుతుందని అసహనం వ్యక్తం చేశారు. తన కల హైదరాబాద్ మంచి గ్లోబల్ సిటీ కావాలని చెప్పుకొచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్