
అమరావతి, 12 సెప్టెంబర్ (హి.స.)
టంగుటూరు 16వ నంబరు జాతీయ రహదారిపై టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు అయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేటపాలెంకు చెందిన వెంకట వినయ్ కుమార్ నెల్లూరులో ఇరిగేషన్ శాఖలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో టిప్పర్ ఒక్కసారిగా అతనిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వినయ్ కుమార్ కాలు నుజ్జునుజ్జయింది. హై వే పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రుడిని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ