
తిరుమల, 12 సెప్టెంబర్ (హి.స.)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణం కంటే కాస్త ఎక్కువగా కొనసాగుతోంది.
శనివారం ఉదయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఎలాంటి దర్శన టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి ఉచిత సర్వదర్శనం లభించడానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా పాలు, తాగునీరు, అల్పాహారం, అన్నప్రసాదాలను టీటీడీ సిబ్బంది క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్నారు.
ఈ ఒక్కరోజే రూ.6.93 కోట్లు ఆదాయం
మరోవైపు నిన్న (శుక్రవారం) ఒక్క రోజే మొత్తం 72,408 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇందులో 28,691 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి ఆలయ హుండీకి నిన్న ఒక్కరోజే రూ.4.39 కోట్ల భారీ ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV