
ఆంధ్రప్రదేశ్ 12 సెప్టెంబర్ (హి.స.)శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ ఆహ్వానం అందించింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుండగా ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబును టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రు, పనబాక లక్ష్మీ, జానకిదేవి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర కలిసి అధికారికంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రికి అందజేశారు.
ముఖ్యమంత్రిని కలిసిన టీటీడీ ప్రతినిధి బృందం... శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను వివరించింది. బ్రహ్మోత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం, వసతి, తాగునీరు, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, భద్రత వంటి అంశాల్లో తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించారు.
ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేదాశీర్వచనం అందించారు. శ్రీవారి ఆశీస్సులు ముఖ్యమంత్రికి ఉండాలని ఆకాంక్షిస్తూ వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.
ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్రతో ప్రత్యేకంగా చర్చించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు... ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించినట్లు సమాచారం.
ప్రతి ఏడాది శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తారు. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన ఏర్పాట్లతో పాటు... రవాణా, భద్రత, వసతి, అన్నప్రసాదం వంటి అంశాలపై టీటీడీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతుండగా... ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా టీటీడీ అధికారులతో సమీక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV