
అనంతపురం, 12 సెప్టెంబర్ (హి.స.)
జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు.. అనంతపురం పోలీస్ కన్వెన్షన్ హాల్లో గణేష్ ఉత్సవాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులతో పోలీసులు సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణ, భద్రతా చర్యలపై డీఎస్పీ దిశానిర్దేశం చేశారు. వినాయక మంటపాల ఏర్పాటుకు పోలీస్, విద్యుత్, అగ్నిమాపక, నగరపాలక సంస్థల నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
ప్రధాన మంటపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని.. విద్యుత్ అలంకరణలను నైపుణ్యం కలిగిన వైర్మెన్లతోనే చేయించాలని స్పష్టం చేశారు.సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం నిర్ణీత సమయం తర్వాత మైక్ సెట్లు, డీజేలకు అనుమతి లేదని హెచ్చరించారు.
ప్రతి మండపం వద్ద 24 గంటలు పర్యవేక్షించేలా శిక్షణ పొందిన వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
నిమజ్జనం రోజున పోలీసుల సూచించిన మార్గాల్లోనే ఊరేగింపులు నిర్వహించాలని.. నిర్ణీత సమయంలో నిమజ్జనం పూర్తి చేయాలని ఆదేశించారు.ఊరేగింపుల్లో మద్యం సేవించి అలజడి సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ చంద్రశేఖర్ హెచ్చరించారు.
గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV