
నారాయణపేట, 15 సెప్టెంబర్ (హి.స.)
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎర్రగుట్ట వద్ద ఉన్న సఖి వన్ స్టాప్ సెంటర్ను జిల్లా కలెక్టర్ ప్రియాంక మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సఖి సెంటర్లోని షెల్టర్ గది, కౌన్సిలింగ్ గది, మీటింగ్ హాల్తో పాటు పై అంతస్తులో నిర్వహిస్తున్న షీ టీం విభాగాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి (డీ డబ్ల్యు ఓ) రాజేందర్ గౌడ్తో కలిసి సఖి సెంటర్ సిబ్బందితో మాట్లాడి కేంద్రం నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. సెంటర్లోని హాజరు రిజిస్టర్, వివిధ రికార్డులను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఇప్పటివరకు సఖి సెంటర్ ద్వారా ఎంతమంది బాధితులకు సేవలు అందించారనే వివరాలతో పాటు, గత నెల రోజులుగా ఎంతమంది బాధితులు సెంటర్ను ఆశ్రయించారనే సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
సెంటర్కు ఎక్కువగా ఎలాంటి కేసులు వస్తున్నాయని, బాల్య వివాహాలకు సంబంధించిన కేసులు ఎన్ని నమోదయ్యాయని కలెక్టర్ ప్రశ్నించగా, వివాహాల సీజన్లో బాల్య వివాహాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా వస్తుంటాయని సెంటర్ బాధ్యురాలు క్రాంతిరేఖ వివరించారు. సఖి సెంటర్లో నమోదైన గృహ హింస, లైంగిక దాడులు, వరకట్న వేధింపులు, పోక్సో, అదృశ్యం, అపహరణ, మోసం, ప్రేమ వివాహాలు, ఆశ్రయం కల్పించిన కేసులు, కౌన్సిలింగ్, వైద్య సేవలు, ప్రస్తుతం విచారణలో ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు