
ఆంధ్రప్రదేశ్ , 15 సెప్టెంబర్ (హి.స.)కేబీఆర్ పార్క్ చుట్టూ తెలంగాణ ప్రభుత్వం రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో ఫ్లై ఓవర్ , అండర్ పాస్ పనులను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వన్-వే ట్రాఫిక్ అమల్లోకి రావడం పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. దీంతో వాహనాలు ఎక్కడా ఆగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతుండటంతో ఫ్లై ఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం అవసరమా? అనే అంశంపై అధికారుల మధ్య విస్తృతంగా చర్చ మొదలైంది. పార్క్ చుట్టూ ప్రధానంగా 6 జంక్షన్లు ఉన్నాయి. కేబీఆర్ పార్క్ వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని గడియారం తిరిగినట్లుగా మళ్లించడం ద్వారా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడం లేదు. గతంలో వాహనదారులు ప్రతి జంక్షన్ వద్ద కనీసం 10 నుంచి 20 నిమిషాల పాటు ఆగాల్సి వచ్చేది. పైగా ఇలా కనీసం రెండు జంక్షన్లను దాటాల్సి వచ్చేది. వన్-వే విధానం వల్ల కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే వాహనాలు కేబీఆర్ పార్క్ మొత్తాన్ని చుట్టేయగలుగుతున్నాయి. రహదారులను గుంతలు లేకుండా చేస్తే రాకపోకల్లో మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్