
అనంతపురం, 19 సెప్టెంబర్ (హి.స.) అనంతపురం నగరంలో మారుమూల ప్రాంతాల్లోని ఇళ్ల వరకు చెత్త సేకరణ వాహనాలు చేరనున్నాయని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు.
అనంతపురం నగరంలో చెత్త సేకరణ, తరలింపు వ్యవస్థను మరింత ఆధునికీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో సమకూర్చిన ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను అనంతపురం నగరపాలక సంస్థకు ప్రభుత్వం కేటాయించిన ఈ-ఆటోలను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ జెండా ఊపి ప్రారంభించారు.
నగరపాలక సంస్థకు మొత్తం 62 ఈ-వాహనాలను ప్రభుత్వం కేటాయించగా తొలి విడతగా 15 వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినూత్న ఆలోచనతో కాలుష్య రహిత చెత్త సేకరణ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు.
చిన్న చిన్న సందుల్లోకి సైతం ఈ-వాహనాలు వెళ్లి చెత్తను సేకరించే అవకాశం ఉందన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం భారీగా చెత్తను పేరుకుపోయేలా చేసిందని ఎమ్మెల్యే దగ్గుపాటి విమర్శించారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV