
కదిరి, 03 సెప్టెంబర్ (హి.స.) శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ అనుబంధ సంఘాల జాతీయ కోఆర్డినేటర్గా విష్ణువర్ధన్ రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే.
అయితే ఆయనకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అజ్ఞాత వ్యక్తులు చించివేశారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జాతీయ కోఆర్డినేటర్గా నూతన బాధ్యతలు స్వీకరించిన విష్ణువర్ధన్ రెడ్డి ఈనెల 5న కదిరిలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
ఇందులో భాగంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లు, వీధుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కేంద్ర మంత్రి సత్యకుమార్, విష్ణువర్ధన్ రెడ్డిల చిత్రాలతో భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే వర్గీయులే... అయితే రాత్రికి రాత్రే ఆ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ దారుణానికి స్థానిక ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ వర్గీయులే కారణమని బీజేపీ నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తమ నాయకుల ఫ్లెక్సీలను ధ్వంసం చేశారని మండిపడుతున్నారు. ఘటన జరిగిన పరిసరాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్ను వెంటనే పరిశీలించి, బాధ్యులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు పోలీసులను డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV