పడవ పై నుంచి నీటిలో పడి యువకుడు మృతి
ఎదుర్లంక వారధి కింద పడవపై నుంచి నీటిలో జారిపడి ఓ యువకుడు మృతి చెందాడు.
Water


అమరావతి, 05 సెప్టెంబర్ (హి.స.)

ఎదుర్లంక వారధి కింద పడవపై నుంచి నీటిలో జారిపడి ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లరేవుకు చెందిన ఉమామహేశ్వరరావు పుట్టినరోజు వేడుకను జీఎంసీ బాలయోగి వారధి ఎనిమిదో స్తంభం వద్ద చేసుకోవడానికి ఏడుగురు స్నేహితులు నిర్ణయించుకున్నారు.

కురసాంపేటకు చెందిన స్నేహితుడి పడవపై గురువారం రాత్రి 10 గంటలకు దరియాలతిప్ప బాలయోగి కాలనీకి చెందిన కర్నీడి శేఖర్తో పాటు మరో ఆరుగురు అక్కడికి వెళ్లారు. వేడుకల్లో మద్యం తాగిన తర్వాత 11 గంటలకు వెనుతిరిగారు. కోరింగనది ముఖద్వారం వద్ద మలుపులో శేఖర్ పడవ నుంచి జారిపడి గోదావరిలో గల్లంతయ్యాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో మిగిలిన స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అర్ధరాత్రి నుంచే సీగల్స్ బోట్ల సాయంతో గౌతమి గోదావరిలో పోలీసులు గాలింపు చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 తర్వాత పడవ నుంచి జారిపడిన ప్రదేశంలోనే శేఖర్ మృతదేహం నదిలో తేలింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande