హైదరాబాద్, 12 అక్టోబర్ (హి.స.)
మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో గత మూడు రోజులుగా కొనసాగుతున్న నేషనల్ రియలేస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్( నారెడ్కో) 15వ ఎడిషన్ ప్రాపర్టీ షో మూడవరోజు కూడా వెలవెలబోయింది. మొదటి రోజు పెద్దగా స్పందన లభించకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన ఎగ్జిబిటర్లు శని, ఆదివారాలైనా ఫ్యామిలీతో కలిసి జనాలు ప్రాపర్టీ షోకు వస్తారని, మంచి ఊపు ఉంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయినా మొదటి రోజు లాగే రెండో రోజు, మూడో రోజు కూడా వారికి నిరుత్సాహం తప్పలేదు. అడపాదడపా వచ్చిన జనాలు కూడా ప్రాపర్టీల గూర్చి తెలుసుకునేందుకు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. దీంతో ఆయా రియలేస్టేట్ కంపెనీలు లక్షల రూపాయలు చెల్లించి స్టాల్స్ ఏర్పాటు చేసి, భారీ సంఖ్యలో సేల్స్ ప్రమోటర్లను పెట్టుకుని ఖాళీగా కూర్చోబెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జనాలు లేక చాలా స్టాల్స్ ఖాళీగా కనిపించాయి. గతంలో నిర్వహించిన ప్రాపర్టీ షోలకు ఎంతో కొంత జనాదరణ లభించినా.. ఈసారి మాత్రం అందుకు విరుద్ధంగా నగర వాసుల నుండి కనీస ఆదరణ కరువైంది. పెద్దగా ప్రచారం లేకపోవడం, మీడియాలో కూడా హడావిడి లేకపోవడంతోనే నారెడ్కో ప్రాపర్టీ షో ఉసూరుమందని పలువురు చర్చించుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..