ఆదిలాబాద్, 15 అక్టోబర్ (హి.స.)
ఆదివాసీల సంస్కృతి,సాంప్రదాయాలు గొప్పవని భవిష్యత్ తరాలకు వాటిని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బుధవారం భీంపూర్ మండలంలోని భగవాన్ పూర్ గ్రామస్థుల ఆహ్వానం మేరకు ఆయన గుస్సాడీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ కి గ్రామస్థులు సంప్రదాయ స్వాగతం పలికారు. అనంతరం గుస్సాడీ ప్రదర్శనలను తిలకించారు. పటేల్, మహాజన్ లతో మాట్లాడి వారి ఆచార, వ్యవహారాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గుస్సాడీ ఆడి వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆదివాసీ, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరు మూఢ నమ్మకాలు విడనాడాలని సూచించారు. అలాగే నాటు వైద్యం, దొంగ బాబాలను అస్సలు నమ్మవద్దన్నారు. పిల్లలను చక్కగా చదివించాలని సెలవులు అయిన వెంటనే పాఠశాలలకు పంపించాలని కోరారు. మద్యం, గంజాయి వంటి అలవాట్లుకు దూరంగా ఉండాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..