జోగులాంబ గద్వాల, 18 అక్టోబర్ (హి.స.)
నేడు బీసీ బంద్ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీసీల పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని బీసీలకు రాజ్యాంగ బద్ధమైన హక్కులు అందించాలని గళమెత్తారు.
ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో ఇప్పటికే బిల్లుకు ఆమోదం లభించింది. అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆ బిల్లుకు మద్దతు తెలిపాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని, పార్లమెంట్ లో చట్టం చేసి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉంది, అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంపై ప్రేమ చూపిస్తామని చెప్పే కేంద్రం, బీసీలకు హక్కు ఇవ్వడంలో మాత్రం ఎందుకు వెనుకడుగేస్తోంది? రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు పార్లమెంటులో ఈ అంశంపై చర్చించి, బీసీల రిజర్వేషన్ల కోసం కృషి చేయాలి, అని వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు