వరంగల్, 18 అక్టోబర్ (హి.స.)
రాబోయే వేసవి కాలానికి, రబీకి సన్నద్ధంగా ఉండటానికి ఇప్పటి నుండే తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి (NPDCL CMD Varun Reddy) పేర్కొన్నారు. ట్రాన్స్కో సీఈలు, ఎస్ఈలు, ఎన్పీడీసీఎల్ ఎస్ఈలు, ఎసీఓలతో హన్మకొండ, నక్కలగుట్టలోని విద్యుత్ భవన్లో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి కొత్తగా నెలకొల్పే 220 కెవి, 132 కెవి కొత్త సబ్ స్టేషన్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు, డబుల్ సర్క్యూట్ లైన్లు, బే ఎక్స్టెన్షన్ ప్రతిపాదనలు పంపాలని, పురోగతిలో ఉన్న పనులు వేగవంతంగా చేయాలని ఆదేశించారు. ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, లక్ష్యాలను నిర్దేశించుకుని తదనుగుణంగా పనులు చేపట్టాలని పిలుపునిచ్చారు. 16 సర్కిళ్ల పరిధిలో కొత్తగా నెలకొల్పే 220 కెవి, 132 కెవి కొత్త సబ్ స్టేషన్లు ఎక్కడైతే పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు ఉందొ అక్కడ పెంచాలని, సబ్ స్టేషన్లో బే ఎక్స్టెన్షన్ల ఏర్పాటు, కొత్త డబుల్ సర్క్యూట్ లైన్ల పై ఎస్ఈలు ప్రతిపాదించారు. వాటికి కావాల్సిన అనుమతుల కొరకు ట్రాన్స్కోకు లేఖలు రాయాలని సీఎండీ తెలిపారు. ముందస్తుగా అన్ని చర్యలు తీసుకొని వేసవికి, రబీకి సన్నద్ధంగా ఉండాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..