హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)
అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగి
మంచిర్యాలకు చెందిన తల్లి, కూతురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్లితే.. మంచిర్యాల పట్టణంలో రెడ్డి కాలనీకి చెందిన ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాత విఘ్నేష్-రమాదేవి దంపతులు. వీరికి ఇద్దరూ కూతుర్లు స్రవంతి, తేజస్వి. వీరు భర్త, పిల్లలతో అమెరికాలో ఉంటున్నారు. ఇటీవల విఘ్నేష్ తన భార్య రమాదేవితో కలిసి అమెరికాలో ఉంటున్న ఇద్దరూ కూతుర్ల వద్దకు వెళ్లారు. విఘ్నేష్ చిన్న కూతురు తేజస్వి రెండు రోజుల క్రితం నూతన గృహ ప్రవేశం చేశారు. స్రవంతి కూతురు పుట్టిన రోజు ఉండటంతో శనివారం విఘ్నేష్, రమాదేవి, తేజస్వి, తేజస్వి భర్త కిరణ్ కుమార్, ఇద్దరూ పిల్లలు కారులో స్రవంతి ఇంటికి బయలుదేరారు. వీరి కారును ట్రక్కు ఢీ కొట్టింది. దీంతో రమాదేవి(52), తేజస్వి (32), ప్రమాదంలో మరణించారు. కారులో ఉన్న విఘ్నేష్ అల్లుడు కిరణ్ కుమార్, పిల్లలకు గాయాలైనట్టు బంధువులు తెలిపారు. విఘ్నేష్ గతంలో తాండూర్ మండలంలోని మాదారం టౌన్ షిప్ లోని సింగరేణి డిస్పెన్సరీ వార్డ్ బాయ్ గా పని చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..