దేశం నుంచి మావోయిజాన్ని తరిమికొడతాం.. ఇది నా గ్యారెంటీ: ప్రధాని మోదీ
ఢిల్లీ, 18 అక్టోబర్ (హి.స.) భారతదేశం త్వరలోనే మావోయిస్టు ఉగ్రవాదం నుంచి పూర్తి విముక్తి పొందుతుందని, ఇది తన వ్యక్తిగత గ్యారెంటీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మావోయిస్టుల హింస ముగింపు దశకు చేరుకుందని ఆయన స్పష్టం చేశారు. న
news-disturbance-at-prime-minister-modis-public-meeting-484637


ఢిల్లీ, 18 అక్టోబర్ (హి.స.) భారతదేశం త్వరలోనే మావోయిస్టు ఉగ్రవాదం నుంచి పూర్తి విముక్తి పొందుతుందని, ఇది తన వ్యక్తిగత గ్యారెంటీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మావోయిస్టుల హింస ముగింపు దశకు చేరుకుందని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

దశాబ్దాలుగా అభివృద్ధిని అడ్డుకుంటూ, పేద గిరిజనులు, రైతులు, గ్రామస్థుల ప్రాణాలను బలిగొంటున్న మావోయిస్టు హింసపై ప్రధాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కొందరు బాధితులు ఢిల్లీ వచ్చి, తమ గోడును వినిపించుకోవడానికి ఏడు రోజులు పడిగాపులు కాశారని గుర్తుచేశారు. వారిలో కాళ్లు, చేతులు కోల్పోయిన వారు కూడా ఉన్నారని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో 'అర్బన్ నక్సల్స్' రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని మావోయిస్టుల దారుణాలను కప్పిపుచ్చారని మోదీ ఆరోపించారు.

ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల వల్ల మావోయిస్టుల ప్రాబల్యం గణనీయంగా తగ్గిందని ప్రధాని తెలిపారు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా 125 జిల్లాల్లో ఉన్న మావోయిస్టుల ప్రభావం, ఇప్పుడు కేవలం 11 జిల్లాలకే పరిమితమైందని వివరించారు. వాటిలో కూడా అత్యంత తీవ్రంగా ప్రభావితమైనవి కేవలం 3 జిల్లాలు మాత్రమేనని స్పష్టం చేశారు. గడిచిన 72 గంటల్లోనే 303 మంది నక్సలైట్లు లొంగిపోయారని, వీరిలో రూ.1 కోటి వరకు రివార్డు ఉన్న కీలక నేతలు కూడా ఉన్నారని వెల్లడించారు.

వీరంతా సాధారణ నక్సలైట్లు కాదు. వారంతా ఇప్పుడు రాజ్యాంగంపై నమ్మకంతో జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారు అని మోదీ అన్నారు. తమ ప్రభుత్వం అభివృద్ధి, భద్రతకు పెద్దపీట వేయడం వల్లే ఈ మార్పు సాధ్యమైందన్నారు. ఒకప్పుడు మావోయిస్టుల అడ్డాగా ఉన్న బస్తర్ వంటి ప్రాంతాల్లో ఇప్పుడు గిరిజనులు 'బస్తర్ ఒలింపిక్స్' నిర్వహిస్తున్నారని, ఇది ఒక సాంస్కృతిక పునరుజ్జీవనానికి సంకేతమని పేర్కొన్నారు.

మావోయిస్టు హింసతో దెబ్బతిన్న ప్రాంతాల్లో ఈ ఏడాది దీపావళి భిన్నంగా, ప్రశాంతంగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. మావోయిస్టు ఉగ్రవాదం నుంచి దేశానికి విముక్తి కలిగే రోజు ఎంతో దూరంలో లేదని, ఇది తన గ్యారెంటీ అని ప్రధాని పునరుద్ఘాటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande