ఢిల్లీ,22,, అక్టోబర్ (హి.స.)
రష్యా – భారత్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రపంచానికి ఈ రెండు దేశాల మధ్య ఉన్న మైత్రి కనిపిస్తూనే ఉంది. భారతదేశం త్వరలో రష్యా నుంచి S-400 వైమానిక రక్షణ వ్యవస్థ కోసం పెద్ద సంఖ్యలో క్షిపణులను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ.10 వేల కోట్లుగా నివేదించారు. భారత వైమానిక దళం S-400 వ్యవస్థ ఇప్పటికే పాకిస్థాన్‌పై తన ప్రభావాన్ని చూపింది. నాలుగు రోజుల ఘర్షణలో ఈ వ్యవస్థ ఐదు నుంచి ఆరు పాకిస్థాన్ యుద్ధ విమానాలను, ఒక గూఢచారి విమానాన్ని 300 కిలోమీటర్ల దూరం నుంచి కూల్చివేసింది. భారత వైమానిక దళం దీనిని గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించింది.
భారత వైమానిక దళం రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ క్షిపణులను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందంపై భారతదేశం – రష్యా మధ్య చర్చలు జరుగుతున్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ అక్టోబర్ 23న ఈ ఒప్పందంపై రష్యాతో చర్చించడానికి సమావేశం కానుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ భారత్- రష్యాతో 10,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకోనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ