
జార్ఖండ్, 26 అక్టోబర్ (హి.స.)
ఓ బ్లడ్ బ్యాంక్ చేసిన నిర్వాకంతో
తలసీమియా చిన్నారులకు హెచ్ఐవీ పాజిటివ్ గా తేలింది. ఈ ఘటన ఝార్ఖండ్ లో కలకలం రేపుతోంది. చాయ్ బాసాలో ఉన్న ఓ బ్లడ్ బ్యాంకులో తలసీమియాతో బాధపడుతున్న బాలుడికి రక్తం ఎక్కించారు.ఆ తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో పరీక్షలు చేయించగా.. హెచ్ఐవీగా తేలిందని తల్లిదండ్రులు వాపోయారు. ఏడేళ్ల తమ కొడుక్కి హెచ్ఐవీ సోకిందని తేలడంతో.. బాధిత కుటుంబం రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా.. ఈ ఘటనపై విచారణకు ఉన్నతస్థాయి వైద్యబృందాన్ని ఏర్పాటు చేశారు.
వైద్యబృందం జరిపిన విచారణలో సదరు బ్లడ్ బ్యాంకు నుంచి రక్తం ఎక్కించుకున్న మరో నలుగురికి కూడా హెచ్ఐవీ పాజిటివ్ గా తేలింది. తలసీమియా రోగులకు సదర్ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్ నుంచి కలుషిత రక్తం ఎక్కించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డాక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. అలాగే బ్లడ్ బ్యాంకులో కొన్ని లోపాలను గుర్తించామని, వాటిని సరిచేయాల్సిందిగా అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు