వెంట్రుకలకు వేసే రంగుల డై ప్యాకెట్లలో అతి తక్కువ మందంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గ్లౌజులు
పర్యావరణానికి ప్రమాదకరం!
వెంట్రుకలకు వేసే రంగుల డై ప్యాకెట్లలో అతి తక్కువ మందంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గ్లౌజులు


హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.)

వెంట్రుకలకు వేసే రంగుల డై (Hair Dye) ప్యాకెట్లలో వినియోగదారులకు ఇస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గ్లౌజులు పర్యావరణానికి తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తున్నాయని ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (EPDC) అధ్యక్షులు ఎస్.సి.హెచ్. రంగయ్య హెచ్చరించారు. ఈ గ్లౌజులను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిబంధనలకు విరుద్ధంగా అతి తక్కువ మైక్రాన్ల మందంతో తయారు చేస్తున్నారు. తక్కువ మందం కారణంగా ఈ ప్లాస్టిక్ మరింత త్వరగా చిన్న ముక్కలుగా విడిపోయి, భూమిలో కలిసిపోకుండా పర్యావరణంలో అలాగే పేరుకుపోతుంది. ఈ గ్లౌజులు కేవలం ఒక్కసారి ఉపయోగించి పారవేసేవి కావడంతో, వీటి వినియోగం భారీగా ఉంది. ఈ అతి తక్కువ నాణ్యత గల ప్లాస్టిక్ భూమి, నీరు, వాయు కాలుష్యానికి దారితీసి, జీవరాశుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని రంగయ్య ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య నివారణ నియమాలను ఉల్లంఘిస్తూ తయారుచేస్తున్న ఈ ప్లాస్టిక్ గ్లౌజుల తయారీ, పంపిణీపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ఈ తీవ్రమైన పర్యావరణ సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిబంధనలను కఠినతరం చేసి, పర్యవేక్షణను పెంచాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిబంధనలను అతిక్రమించి, అతి తక్కువ మైక్రాన్ల మందంతో గ్లౌజులు తయారు చేస్తున్న కంపెనీలపై భారీ జరిమానాలు విధించాలి, లేదా ఉత్పత్తిని నిలిపివేయాలి. రంగుల డై ప్యాకెట్లలో ప్లాస్టిక్‌కు బదులుగా బయోడిగ్రేడబుల్ లేదా పర్యావరణ హితకరమైన ప్రత్యామ్నాయ వస్తువులతో తయారు చేసిన గ్లౌజులను తప్పనిసరి చేయాలి. వినియోగదారులు, తయారీదారులలో పర్యావరణ స్పృహ పెంచేందుకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని ఎస్.సి.హెచ్. రంగయ్య ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయా కంపెనీలు స్వచ్ఛందంగా ఆ గ్లౌజ్ ల స్థానంలో బయో డిగ్రేడబుల్ కవర్స్ వినియోగదారులకు అందించాలని, లేకుంటే న్యాయస్థాలను ఆశ్రయిస్తామని రంగయ్య హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande