
అనంతపురం, 26 అక్టోబర్ (హి.స.)అనంతపురం రూరల్ పరిధిలోని పాపంపేటలో నెలకొన్న భూ వివాదంపై ఇప్పటి వరకు తమను ఎవరూ సంప్రదించలేదని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ తెలిపారు.
పాపంపేటలో 10 వేల ఇళ్లను కూల్చివేస్తారని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. పాపంపేట భూ వివాదంపై తమకు పూర్తి సమాచారం లేదన్నారు. దాని గురించి పూర్తిగా తెలిసే వరకు వివాదంపై స్పందించొద్దని అనుకున్నామన్నారు. కానీ వైకాపా నేతలు కుట్రపూరిత ప్రచారాలకు తెరలేపారన్నారు. 10వేల ఇళ్లను కూల్చివేస్తారని చెబుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. పాపంపేట ప్రజల ఇంటి మీద ఒక్క చెయ్యి పడినా అది తమ మీద పడినట్లేనని స్పష్టం చేశారు. కేవలం 20 ఎకరాల ప్రైవేటు భూములపై వివాదం నెలకొందని, అందులోకి పరిటాల సిద్ధార్థ పేరును కావాలనే లాగుతున్నారని తెలిపారు. భూమి జీపీఏ చేసుకున్న సుభాష్ రెడ్డి, శ్రీరాములు వైకాపా నేతలేనన్నారు. పాపంపేట వివాదంలో మంత్రి లోకేష్ కు సంబంధం ఉందనే ఆరోపణలను కొట్టి పారేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV