
అమరావతి, 27 అక్టోబర్ (హి.స.)
అమరావతి: రాష్ట్రం వైపు వేగంగా దూసుకొస్తున్న మొంథా తుపానుపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు ) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని పేర్కొన్నారు. కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేయాలన్నారు. పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. జిల్లాల్లో అత్యవసర వైద్య సేవలు అందించే సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. భవిష్యత్‌లో వచ్చే తుపాన్లను ఎదుర్కొనే విధంగా ఈ కార్యాచరణ ఒక రోల్‌మోడల్‌గా ఉండాలని సీఎం అధికారులకు సూచించారు.
‘‘పునరావాస కేంద్రాలకు ప్రత్యేకంగా ఇన్‌ఛార్జ్‌లను నియమించాలి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా, ఎక్కడా కలుషితం కాకుండా చూసుకోవాలి. ప్రభావిత జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలి. ఎక్కడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలి. జిల్లాల్లో తుపాను రక్షణ చర్యలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లదే. వాలంటీర్లుగా వచ్చే వారిని సహాయక కార్యక్రమాలకు వినియోగించుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగమంతా నిబద్ధతతో పనిచేసి మొంథా తుపానును సమర్థవంతంగా ఎదుర్కోవాలి. మానవ ప్రయత్నంలో ఎలాంటి అలసత్వం కనిపించకూడదు’’ అని సీఎం పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ