
ఢిల్లీ,27, అక్టోబర్ (హి.స.)
సమయం వచ్చిన ప్రతి సారి భారత్‌కు వ్యతిరేకంగా చైనా పావులు కదుపుతుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని చెప్పడానికి కారణం ఏమిటంటే.. 2020 భారత్ – చైనా మధ్య ఘర్షణ జరిగిన ప్రదేశం నుంచి కేవలం 110 కి.మీ దూరంలో డ్రాగన్ దేశం కొత్త వైమానిక రక్షణ సముదాయాన్ని నిర్మించినట్లు సమాచారం. టిబెట్‌లోని పాంగాంగ్ సరస్సు తూర్పు తీరంలో ఈ నిర్మాణం వేగంగా జరుగుతోందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. భారత సరిహద్దు సమీపంలో చైనా కొత్త వైమానిక రక్షణ సముదాయాన్ని నిర్మించిందని ఉపగ్రహ చిత్రాలు సైతం వెల్లడించాయి.
నైమా ఎయిర్‌ఫీల్డ్‌కు ముప్పు
ఈ చిత్రాల్లో చైనా నిర్మించిన సురక్షితమైన క్షిపణి లాంచర్ సైట్‌లు కనిపిస్తున్నాయి. భారతదేశానికి వ్యతిరేకంగా చైనా వైమానిక రక్షణను బలోపేతం చేయడానికి ఇది ఒక కొత్త ప్రయత్నంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవ నియంత్రణ రేఖ (LAC) నుంచి కేవలం 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశానికి చెందిన నైమా ఎయిర్‌ఫీల్డ్‌కు దీంతో ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు