
ఢిల్లీ,27, అక్టోబర్ (హి.స.)
: దేశవ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరంలో దాదాపు 8వేల పాఠశాలల్లో ఒక్క విద్యార్థీ చేరలేదు. ఈ తరహా పాఠశాలలున్న రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో పశ్చిమ బెంగాల్, తర్వాతి స్థానాల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్ ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఒక్క విద్యార్థీ చేరని ఈ పాఠశాలల్లో 20,187 మంది ఉపాధ్యాయులు పని చేస్తుండటం గమనార్హం.
పశ్చిమ బెంగాల్‌లో విద్యార్థులు చేరని స్కూళ్లు 3,812 ఉండగా.. వాటిలో 17,965 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు.
తెలంగాణలో 2,245 విద్యాలయాల్లో 1,016 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.
కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, దమణ్ దీవ్- దాద్రానగర్ హవేలీ, చండీగఢ్‌లలో ఈ తరహా పాఠశాలలు లేవు.
హరియాణా, మహారాష్ట్ర, గోవా, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల్లోనూ విద్యార్థులు లేని స్కూళ్లు లేకపోవడం విశేషం. మరోవైపు దేశవ్యాప్తంగా 33 లక్షల మంది విద్యార్థులు ఒకే టీచరున్న పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ తరహా పాఠశాలల్లో ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండగా.. తర్వాతి స్థానాల్లో ఉత్తర్‌ప్రదేశ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ