
కర్నూలు , 27 అక్టోబర్ (హి.స.)ఇటీవల కర్నూలు జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై దాదాపు 19 మంది మృతి చెందగా, మరికొందరు గాయాలతో బయటపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. గతంలో బస్సులు గమ్యస్థానాలకు చేరిన తర్వాత అధికారులు తనిఖీ చేసేవారు. ప్రస్తుతం అధికారులు తమ వ్యూహాన్ని మార్చి బస్సులు బయలుదేరే ప్రాంతాల్లోనే తనిఖీలు చేస్తున్నారు.
దీంతో అధికారుల తనిఖీల్లో పట్టుబడితే కేసులు నమోదు చేయడం, భారీ ఎత్తున జరిమానాలు విధించడం లేదా సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకుంటారన్న భయంతో పలు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను రోడ్డు మీదకు తీసుకురావడం లేదు. రెండు రోజులుగా వందలాది ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు వాటి పార్కింగ్ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. అన్ని అనుమతులు ఉన్న కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు మాత్రమే నడుస్తున్నాయి.
అయితే కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో చాలా మంది ప్రయాణికులు కూడా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఎక్కేందుకు వెనుకాడుతున్నారు. దీంతో ఆన్‌లైన్ రిజర్వేషన్లలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరోవైపు ఎక్కువ శాతం మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది.
హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు పూర్తి ప్రయాణికులతో నడుస్తున్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే 200కు పైగా బస్సు సర్వీసుల్లో సీట్లు అన్నీ నిండిపోయాయి. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో పలు ప్రాంతాలకు ఆర్టీసీ అధికారులు అదనపు సర్వీసులను ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV