అమరావతి, 4 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ సేవలో ((AutoDriverSevalo)) పథకాన్ని ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకం క్రింద రాష్ట్రవ్యాప్తంగా సొంత ఆటో, క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వార్షికంగా రూ. 15,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. మొత్తం 2,90,234 మంది అర్హులను గుర్తించి, రూ. 435.35 కోట్ల నిధులు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. దీంతో ఆటో డ్రైవర్ల ఆదాయాన్ని స్థిరీకరించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం అమలు చేయడం వల్ల ఆటోలకు పెద్దగా డిమాండ్ లేకపోవడం వల్ల.. ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది.
ఇదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. ఇది గమనించిన ఏపీ సీఎం.. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు ఈ ఆటో డ్రైవర్ సేవలో' పథకాన్ని ప్రారంభించారు. ఇదిలా ఉంటే గతంలో కూడా ఏపీలో వాహన మిత్ర పథకం కింద ప్రతి డ్రైవర్‌కు రూ. 10,000 అందించారు. కానీ ఈ కొత్త పథకం (new scheme) ద్వారా ఆర్థిక సహాయాన్ని పెంచడం ద్వారా ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారు. అర్హత కలిగిన డ్రైవర్లు తమ ఆధార్ నంబర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లో తమ పేరును తనిఖీ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV