
హైదరాబాద్, 11 నవంబర్ (హి.స.)
ప్రముఖ కవి అందెశ్రీ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అందెశ్రీని కోల్పోవడం తనకు వ్యక్తిగతంగా తీరని లోటు అని చెప్పుకొచ్చారు. అలాగే ఆయన తెలంగాణ కోసం చేసిన సేవలను గుర్తుంచుకొని.. పాఠ్య పుస్తకాల్లో జయ జయహే తెలంగాణ గీతం పెడతామని అన్నారు.
అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని, త్వరలోనే అందెశ్రీ స్మృతివనం (Andesri Memorial Park) ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన పాటల సంకలనం నిప్పుల వాగు ఒక భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా తెలంగాణ సమస్యలపై పోరాడేవారికి గైడ్గా ఉపయోగపడుతుందని, ఆయన రచనలతో 20 వేల పుస్తకాలను ముద్రించి తెలంగాణలోని ప్రతీ లైబ్రరీలో నిప్పుల వాగు ను అందుబాటులో ఉంచుతామని రేవంత్ చెప్పుకొచ్చారు. అలాగే అందెశ్రీకి పద్మశ్రీ (Padma Shri) ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దీనికి సహకరించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుగా కలిసి అందెశ్రీని పద్మశ్రీ గౌరవించుకునేందుకు కృషి చేద్దామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు