
అమరావతి, 13 నవంబర్ (హి.స.)
మదనపల్లె నేర వార్తలు: అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ వ్యవహారంపై చిత్తూరు జిల్లా వైద్యాధికారుల బృందం విచారణ చేపట్టింది. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో విశాఖపట్నానికి చెందిన యమున చిక్కుకొని మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చిత్తూరు డీసీహెచ్ఎస్ పద్మాంజలి దేవి, వైద్యుడు లక్ష్మీనరసయ్య, ఇతర వైద్యుల బృందం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టింది.
ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేశ్‌తో వారు మాట్లాడి మృతదేహానికి మదనపల్లెలో పోస్టుమార్టం ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ఫొరెన్సిక్ నిపుణులు అందుబాటులో లేకపోవడం వల్ల తిరుపతి రుయాకు మృతదేహాన్ని తరలించినట్లు ఆయన బదులిచ్చారు. అనంతరం వైద్య బృందం మదనపల్లె ఎస్బీఐ కాలనీలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తనిఖీ కోసం వెళ్లింది. అక్కడ జిల్లా అధికారులు వేసిన సీలును తొలగించి ఉండటంతో పాటు.. తాళం వేసి ఉండటంతో వెనుతిరిగి వచ్చారు. తనిఖీల్లో వైద్యులు హరగోపాల్, సాయి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ