
ఢిల్లీ, 3 నవంబర్ (హి.స.)దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాలకు భారీ ప్రోత్సాహం అందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ముందడుగు వేశారు. సోమవారం ఢిల్లీలోని భారత్ మండపంలో 'ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంక్లేవ్ (ఎస్టిక్) 2025'ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ శాస్త్ర, సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేసే లక్ష్యంతో రూ. లక్ష కోట్ల 'పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల (RDI) పథకం' నిధిని కూడా ఆయన జాతికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... తొలుత భారత మహిళల క్రికెట్ జట్టు సాధించిన చారిత్రక విజయం గురించి ప్రస్తావించారు. వారి అద్భుత ప్రదర్శనకు దేశం గర్విస్తోందని, యావత్ జట్టుకు తన అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. అలాగే, నిన్న ఇస్రో ప్రయోగించిన జీశాట్-7ఆర్ కమ్యూనికేషన్ ఉపగ్రహం విజయవంతం కావడంపై శాస్త్రవేత్తలను అభినందించారు.
దేశంలో పరిశోధన, అభివృద్ధికి కొత్త అవకాశాలు కల్పించేందుకే రూ. లక్ష కోట్ల ఆర్‌డీఐ ఫండ్‌ను ప్రారంభించామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేటు రంగంలోనూ ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. ఆధునిక ఆవిష్కరణల వ్యవస్థను నిర్మించేందుకు 'ఈజ్ ఆఫ్ డూయింగ్ రీసెర్చ్'కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం ఇప్పటికే ఆర్థిక నియమాలు, సేకరణ విధానాల్లో సంస్కరణలు తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ దార్శనికత వల్లే శాస్త్ర సాంకేతిక రంగాలకు ప్రోత్సాహం లభిస్తోందన్నారు. దశాబ్దాలుగా ప్రతిభ ఉన్నప్పటికీ మన శాస్త్రవేత్తలకు సరైన సౌకర్యాలు లేవని, కానీ మోదీ నాయకత్వంలో ఇప్పుడు వికసిత్ భారత్ దిశగా పయనిస్తున్నామని చెప్పారు. స్టార్టప్‌లు, గగన్‌యాన్, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో సాధించిన ప్రగతితో భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
నవంబర్ 3 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ 'ఎస్టిక్ 2025' సదస్సులో విద్యాసంస్థలు, పరిశోధన కేంద్రాలు, పరిశ్రమలు, ప్రభుత్వ రంగాల నుంచి 3,000 మందికి పైగా ప్రతినిధులు, నోబెల్ గ్రహీతలు, శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, అంతరిక్ష సాంకేతికత సహా 11 కీలక అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. యువ ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు, పరిశోధకులను పరిశ్రమలతో అనుసంధానం చేయడానికి, వారి ఆలోచనలకు సరైన వేదికను అందించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఒక ప్రకటనలో పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV