
హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.)
అక్రమ ట్యాపింగ్ కేసులో దాదాపు 21 నెలల తర్వాత తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తొమ్మిది మంది పోలీసు అధికారులతో ఏర్పాటైన ఈ సిట్ హైదరాబాద్ కమిషనర్ వి.సి. సజ్జనార్ (VS Sajjanar) పర్యవేక్షణలో పనిచేయనుంది. అయితే, కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు (Prabhakar Rao) కస్టోడియల్ విచారణకు ఈ నెల 26 వరకు సుప్రీంకోర్టు గడువు ఇవ్వడంతో ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కొత్త సిట్ సభ్యులతో సీపీ సజ్జనార్ సమావేశమయ్యారు. మొదట ఎక్కడి నుంచి విచారణకు ప్రారంభించాలనే అంశంపై ప్రధానంగా చర్చించారు.
అనంతరం కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును జూబ్లీహిల్స్ (Jubilee Hills) నుంచి సీసీఎస్ (CCS) ఆఫీసుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ జూబ్లీహిల్స్ పీఎస్కు తీసుకొచ్చారు. విచారణలో భాగంగా సిట్ టీమ్ ప్రభాకర్ రావును ఓ ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు