
ఖమ్మం, 21 డిసెంబర్ (హి.స.)
ఖమ్మం ప్రాంతీయ రవాణా శాఖలో
అవినీతి బట్టబయలు అయ్యింది. ఆర్టీఏ కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరి నుంచి ఏజెంట్లు ద్వారా కోడ్ వేసి బహిరంగంగా కలెక్షన్లు వసూలు చేస్తున్నారని విచారణలో తేలింది. ఖమ్మం నగరంలోని ఆర్టీఏ కార్యాలయం ఎదురుగా కొంతమంది ఏజెంట్లను ఏర్పాటుచేసి వారి ద్వారా ప్రతి ఫైలుకు డబ్బులు తీసుకుంటున్నట్లు ఏసీబీ విచారణలో వెల్లడైంది. శనివారం ఏసీబీ అధికారులు ఆర్టీఏ కార్యాలయంలో సోదాలు చేసి పలు కీలక ఫైల్ను స్వాధీనం చేసుకున్నారు.
ప్రైవేట్ ఏజెంట్లను అర్ధరాత్రి వరకు ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. దొరికిన నగదు ఎవరికి ఇస్తున్నారంటూ విచారణ చేయగా ఏజెంట్లు కార్యాలయంలోని అధికారి కోసమే వసూళ్లు చేస్తున్నట్లు లిఖితపూర్వకంగా రాసిచ్చారని తెలుస్తోంది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు