
అమరావతి, 25 డిసెంబర్ (హి.స.)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ (Former Prime Minister Atal Bihari Vajpayee) జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వెంకటపాలెం సమీపంలోని సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న 2.5 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 'అటల్ స్మృతి వనం'ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister Nara Chandrababu Naidu), కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chauhan) కలిసి ప్రారంభించారు. ఈ స్మృతి వనంలో ఏర్పాటు చేసిన 14 అడుగుల ఎత్తైన వాజ్‌పేయీ భారీ కాంస్య విగ్రహాన్ని వారు ఆవిష్కరించి, అటల్ జీకి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో వాజ్‌పేయీ పోషించిన పాత్ర చిరస్మరణీయమని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అమరావతికి ఒక ప్రత్యేకతను చేకూర్చేలా ఈ స్మృతి వనాన్ని తీర్చిదిద్దామని, ఇది భవిష్యత్తు తరాలకు ఆయన ఆదర్శాలను చాటిచెబుతుందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. అటల్ జీ చూపిన సుపరిపాలన మార్గంలోనే దేశం ముందుకు సాగుతోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అటల్ జీకి నివాళులర్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV