
కేరళ, 25 డిసెంబర్ (హి.స.)
కేరళలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో క్రిస్మస్ వేడుకల నిర్వహణకు సంబంధించి ఆరెస్సెస్ (RSS) అనుబంధ సంస్థలు బెదిరింపులకు పాల్పడుతున్నాయన్న వార్తలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ వంటి లౌకిక రాష్ట్రంలో ఇలాంటి మతవిద్వేషపూరిత చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఆరెస్సెస్ శ్రేణుల ఒత్తిడికి తలొగ్గి క్రిస్మస్ వేడుకలను రద్దు చేశాయని, విద్యార్థుల నుంచి సేకరించిన చందాలను తిరిగి ఇచ్చేసినట్లు ప్రభుత్వానికి నివేదికలు అందాయి. ఈ ఘటనలపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని కేరళ ప్రభుత్వాని ఆదేశిస్తున్నాను. మత వివక్షను ప్రోత్సహించే స్కూల్ మేనేజ్మెంట్లపై, వేడుకలను అడ్డుకొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాయడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. భారతదేశపు భిన్నత్వంలో ఏకత్వాన్ని, ప్రజల మధ్య ఉన్న సామరస్య పూర్వక సహజీవనాన్ని సంఘ్ పరివార్ వ్యతిరేకిస్తోంది అని ముఖ్యమంత్రి పినరయి ధ్వజమెత్తారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు