
అమరావతి, 29 డిసెంబర్ (హి.స.)
సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం (Cabinet Meeting) ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో జరుగుతున్న సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర మంత్రులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో 20కిపైగా అజెండా అంశాలపై చర్చిస్తున్నారు. అమరావతి అభివృద్ధికి రూ.7,387 కోట్ల రుణానికి ఆమోదం లభించనుంది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధులతో అమరావతి క్యాపిటల్ సిటీ ప్యాకేజీ, రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా వంటి వాటికి అనుమతి ఇవ్వనుంది.
మంగళగిరి-తాడేపల్లి పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎస్టీపీ పనులకు, అటవీ శాఖలో అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుల భర్తీకి అంగీకారం తెలపనున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ లబ్ధిదారులపై పెండింగ్ వడ్డీ మాఫీకి, ప్రీపెయిడ్ విద్యుత్ స్మార్ట్ మీటర్ల అమలుకు సూతప్రయా ఆమోదం లభించనుంది. కలంగి వరద నియంత్రణ పనులకు పరిపాలనా అనుమతి మంత్రివర్గం ఇవ్వనుందని తెలుస్తోంది. ఉద్యోగుల డీఏ పెంపు అమలుకు ఆర్థిక శాఖ అనుమతికి మంత్రి వర్గం పచ్చ జెండా ఊపనుంది. గ్రామ, వార్డు సచివాలయాల పేర్ల మార్పుపై ఆర్డినెన్స్, జిల్లా కోర్టులో సిస్టం ఆఫీసర్లు, అసిస్టెంట్ల పోస్టులకు ఆమోదం లభించనుంది.
దుగరాజపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు, దగదర్తి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు భూసేకరణకు అనుమతిని మంత్రి వర్గం ఇవ్వనుంది. రోడ్డు భద్రత కోసం లైఫ్ ట్యాక్స్ పై 10 శాతం సెస్ విధించేందుకు సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. నూజివీడులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ఏర్పాటుకు చర్యలు, ఐఐపీఎం ఏర్పాటు కోసం ప్రభుత్వ భూమి లీజుకు ఆమోదం, వేదాంత సంస్థకు ఆయిల్ డ్రిల్లింగ్ కోసం భూమి లీజు పునరుద్ధరణ చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. తిరుపతి డామినేడులో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు భూమి బదలాయింపునకు ఆమోదం, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో స్టాంప్ డ్యూటీ మినహాయింపు వంటి అంశాలకు మంత్రి వర్గం మార్గం సుగమం చేయనుందని తెలుస్తోంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV