
అమరావతి, 30 డిసెంబర్ (హి.స.)
జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలకు మాత్రమే పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఉన్న అన్నమయ్య జిల్లాను పూర్తిగా పునర్వ్యవస్థీకరించి.. జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చాలన్న ప్రతిపాదనను మంత్రివర్గంలో చర్చించి ఆమోదించారు. అయితే రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలోనే కొనసాగుతుంది. కానీ రాజంపేటను కడప జిల్లాలో, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో విలీనం చేయాలన్న ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటులో ఎలాంటి మార్పులు లేవు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ మార్పులు చేశారు. మొత్తంగా కొత్తగా 2 జిల్లాలు, ఐదు రెవెన్యూ డివిజన్లు, రెండు మండలాలు, ఇంకొన్ని జిల్లాల్లో మార్పుచేర్పులను మంత్రివర్గం ఆమోదించింది. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఇందులో జిల్లాల పునర్విభజనపై సుదీర్ఘంగా చర్చించినట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. మంత్రివర్గ నిర్ణయాలను సహచర మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌తో కలిసి మీడియాకు వివరించారు. ‘రంపచోడవ రం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు నిర్ణయించాం. మార్కాపురం, కనిగిరి, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలతో కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటవుతుంది.
కొత్తగా మదనపల్లె జిల్లా ఏర్పాటుపైనా క్యాబినెట్ చర్చించింది. రాయచోటి నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే అవకాశం లేనందున, దానిని అన్నమయ్య జిల్లాలోనే ఉంచుతూ, మదనపల్లెను జిల్లా కేంద్రంగా మార్చాలని నిర్ణయించింది. రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలోకి, రాజంపేటను కడపలోకి మార్చడానికి ఆమోదం తెలిపింది. గూడూరులోని గూడూరు, కోట, చిలుకూరు మండలాలు నెల్లూ రు జిల్లాలోకి వస్తాయి. చిట్టమూరు, వాకాడ మండలాలు సూళ్లూరుపేట డివిజన్‌లో, తిరుపతి జిల్లాలో కొనసాగుతాయి. అద్దంకి నియోజకవర్గం బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలోకి మారుతుంది. దర్శి నియోజకవర్గం అద్దంకి సబ్ డివిజన్‌లో ఉంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ