
తిరుమల , 30 డిసెంబర్ (హి.స.)
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో వైకుంఠ ద్వార దర్శన పర్వం ప్రశాంతంగా కొనసాగుతోంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) అన్నారు. ఇవాళ ఆయన తిరుమల ప్రధాన ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ.. అనుకున్న సమయం కంటే ముందుగానే వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. టీటీడీ (TTD) అధికారులు భక్తుల సౌలభ్యం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని పేర్కొన్నారు. వైకుంఠ ద్వారం తెల్లవారుజామున 12:05 గంటలకు తెరిచారని వివరించారు. దీంతో ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని తెలిపారు.
టోకెన్లు ఉన్న భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి మరో 10 నుంచి 12 గంటల పాటు సౌకర్యవంతంగా దర్శనం కల్పిస్తున్నట్లు బీఆర్ నాయుడు తెలిపారు. మొదటి మూడు రోజులు టోకెన్లు ఉన్న వారికే ఉత్తర ద్వార దర్శనం పరిమితం చేశామని, ఆ తర్వాత సర్వదర్శనం ప్రారంభమవుతుందని అన్నారు. టీటీడీ అధికారులు ఇంటిగ్రేటెడ్ AI కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (Integrated AI Command and Control Center) ద్వారా భక్తుల రద్దీని నియంత్రిస్తున్నారని తెలిపారు. 3 వేల మంది పోలీసులతో పాటు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. క్యూలైన్లలో అన్నప్రసాదం, మంచినీరు, మెడికల్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని బీ.ఆర్. నాయుడు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV