
న్యూఢిల్లీ, 31 డిసెంబర్ (హి.స.)
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన
ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రముఖ ప్రైవేటు టెలికాం రంగ సంస్థ వోడాఫోన్ ఐడియాకు ఊరట కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
వోడాఫోన్ ఐడియాకు చెందిన రూ.87,695 కోట్ల AGR బకాయిలను డిసెంబర్31, 2025 నాటికి ఫ్రీజ్ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బకాయిల మొత్తాన్ని ఫైనాన్షియల్ ఇయర్ 2031-32 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2040-41 వరకు (10 సంవత్సరాలు) చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. మొదటి 5 సంవత్సరాలు వడ్డీ లేకుండా పేమెంట్ వాయిదా ఉంటుంది. అయితే, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఫైనల్ అయిన ఫైనాన్షియల్ ఇయర్ 2017-18, ఫైనాన్షియల్ ఇయర్ 2018-19 బకాయిలు మార్పు లేకుండా ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2030-31 మధ్య బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో వోడాఫోన్ ఐడియాకు భారీ ఊరట లభించింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు