హైదరాబాద్, 28 జూలై (హి.స.)
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి.. కేసులు పెట్టారు. ఈ మేరకు సోమవారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తన ఎక్స్ ఖాతా వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు. సూసైడ్ స్టార్ కౌశిక్ రెడ్డి నీ సొల్లు మాటలాపు అని ఆసక్తికర ట్వీట్ చేశారు. నాకు ఓట్లు వేయకపోతే పాడె మీద పడుకుంటానని ప్రజలను బ్లాక్ మెయిల్ చేశాడని, ఆయన్ను సూసైడ్ స్టార్ అంటారని విమర్శలు గుప్పించారు. 16 మంది హీరోయిన్ల ఫోన్లో ట్యాప్ అయ్యాయని అబద్ధాలు ప్రచారం అని పేర్కొన్నారు. ఇదా మీ రాజకీయం? సూసైడ్ స్టార్ అంటూ పాడి కౌశిక్ రెడ్డికి ట్యాగ్ చేశారు. మీ దొర దగ్గర మార్కులు కొట్టేయడానికి, పాపులారిటీ కోసం చేసే ఈ దరిద్రపు డ్రామాలు ఇకనైనా ఆపు అని హితవు పలికారు. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు మా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు.. అని ఎంపీ తన ట్వీట్లో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్