ముంబయి 01 సెప్టెంబర్ (హి.స.)దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి (Stock Market Today). అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు కొనసాగుతున్నప్పటికీ.. మన సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 312 పాయింట్ల లాభంతో 80,121 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 95 పాయింట్లు పుంజుకొని 24,522 వద్ద కదలాడుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 17 పైసలు తగ్గి, 88.26 వద్ద ఉంది.
నిఫ్టీ సూచీలో టెక్ మహీంద్రా, టీసీఎస్, ఎన్‌టీపీసీ, హీరో మోటార్‌కార్ప్, ట్రెంట్ షేర్లు లాభాల్లో ఉండగా.. జియో ఫైనాన్షియల్, రిలయన్స్, మారుతీ సుజుకీ, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ నష్టాల్లో కదలాడుతున్నాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియగా.. నేటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్ల సూచీలు మిశ్రమంగా కదలాడుతున్నాయి. కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడం, ప్రధాని మోదీ చైనా పర్యటన కారణంగా మన సూచీల్లో సానుకూల సెంటిమెంట్ కనిపిస్తోంది. అదే లాభాల బాటకు దోహదం చేస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ