న్యూఢిల్లీ, 01 సెప్టెంబర్ (హి.స.) అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియా పోస్ట్ ఆదివారం తెలిపింది. అగ్రరాజ్య కస్టమ్స్ విభాగం జారీ చేసిన కొత్త నిబంధనల్లో స్పష్టత లేకపోవడంతో 100 డాలర్లు అంత కంటే ఎక్కువ విలువ ఉన్న బహుమతులకు సంబంధించిన పోస్టల్ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు గత నెల 23న ఇండియా పోస్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 100 డాలర్ల వరకూ విలువవున్న బహుమతులు, లేఖలు, డాక్యుమెంట్ల సేవలు యథాతథంగా కొనసాగుతాయని ప్రకటించింది. ఇప్పుడు ఆ సేవలనూ నిలిపివేసింది. ఇప్పటికే ఎవరైనా బుకింగ్ పూర్తిచేస్తే వారికి రిఫండ్ చెల్లిస్తామని అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ