కోల్‌కతా/న్యూఢిల్లీ,14,సెప్టెంబర్ (హి.స.) తీర ప్రాంతానికి చేరువలోని సాగరజలాల్లో శత్రు జలాంతర్గాముల ఉనికిని పట్టేసే యుద్ధనౌక అండ్రోత్ శనివారం నౌకాదళం చేతికి అందింది. కోల్‌కతాలోని ప్రభుత్వ రంగ నౌకా నిర్మాణ సంస్థ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్‌ఎస్‌ఈ) దీన్ని రూపొందించింది. ఈ శ్రేణిలో ఇది రెండో యుద్ధనౌక. మొదటిది ఐఎన్‌ఎస్ అర్నాలా. అది జూన్ 18న లాంఛనంగా భారత నౌకాదళంలో చేరింది. లక్షదీవుల్లోని అండ్రోత్ అనే దీవి పేరును రెండో యుద్ధనౌకకు ఖరారు చేశారు. ఇందులో దేశీయంగా రూపొందించిన 30 ఎంఎం సర్ఫేస్ గన్ ఉంది. లోతు తక్కువగా ఉన్న జలాల్లోని జలాంతర్గాములను వేటాడే 16 అధునాతన నౌకలకు నేవీ ఆర్డర్ పెట్టింది. ఇందులో ఎనిమిదింటిని జీఆర్‌ఎస్‌ఈ ఉత్పత్తి చేస్తోంది. తీర ప్రాంతానికి చేరువలోని జలాలపై నిఘావేసే సామర్థ్యం వీటికి ఉంది. విమానాలతో సమన్వయం చేసుకుంటూ శత్రు జలాంతర్గాములను వేటాడగలవు. అధునాతన పోరాట నిర్వహణ వ్యవస్థలు వీటి సొంతం. ఈ యుద్ధనౌకల్లో తేలికపాటి టోర్పిడోలు, జలాంతర్గామి విధ్వంసక రాకెట్లు ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ