న్యూఢిల్లీ,14,సెప్టెంబర్ (హి.స.)ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మణిపుర్ పర్యటనను కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. జాతుల మధ్య హింస చెలరేగిన ఎన్నో రోజుల తర్వాత మోదీ మణిపుర్‌లో పర్యటించడం ఆ రాష్ట్ర ప్రజలను అవమానించడమే అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. మోదీ తనకు తానుగా స్వాగత వేడుకను నిర్వహించుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంత్రి, భద్రతలు కాపాడాల్సిన బాధ్యత భాజపాదేనని, దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని గుర్తు చేశారు. ‘864 రోజుల హింసలో 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 6,700 మంది నిరాశ్రయులయ్యారు. 1,500 మందికిపైగా గాయపడ్డారు. అప్పటినుంచి మీరు 46 విదేశీ పర్యటించారు. కానీ మీకు సొంత పౌరులతో మాట్లాడి సానుభూతి వ్యక్తం చేయడానికి సమయమే దొరకలేదా? అప్పుడు మీ రాజధర్మం ఏమైంది?’ అని ఖర్గే ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రస్తావిస్తూ.. ‘మోదీ ఇప్పుడైనా ఆ రాష్ట్రంలో పర్యటించడం మంచిదే. కానీ ఇంతకాలం జరిగిన హింస, ప్రాణ నష్టాన్ని ఆపేందుకు ముందే వచ్చి ఉంటే బాగుండేది’ అని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ