చెన్నై,/న్యూఢిల్లీ,14,సెప్టెంబర్ (హి.స.) ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు భారతరత్న పురస్కారం కోసం ప్రతిపాదించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తెలిపారు. ఇళయరాజా సినీ జీవితంలోకి అడుగుపెట్టి 50 ఏళ్లయిన సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ఆయనకు చెన్నైలో శనివారం సాయంత్రం సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఇళయరాజాను ముఖ్యమంత్రి స్టాలిన్ జ్ఞాపికతో సన్మానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... నైపుణ్యం, కృషి ఉంటే ఎంతటి ఉన్నత శిఖరానికైనా చేరవచ్చని ఇళయరాజా నిరూపిస్తున్నారని తెలిపారు. ఆయన సంగీతం తల్లిగా జోల పాడుతోందని, ప్రేమ భావోద్వేగాలను కీర్తిస్తోందని, విజయ ప్రస్థానానికి ప్రేరణ అందిస్తోందని, బాధలను ఓదార్చుతోందని పేర్కొన్నారు. సంగీత కళాకారులను ప్రోత్సహించేలా ఏటా తమిళనాడు ప్రభుత్వం తరఫున ఇళయరాజా పేరిట పురస్కారం అందించనున్నట్లు ప్రకటించారు. ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలు, సంగీత ప్రియుల తరఫున ప్రతిపాదించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, మంత్రి సామినాథన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం, నటులు రజనీకాంత్, కమల్‌హాసన్, కార్తి తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ