అమరావతి, 16 సెప్టెంబర్ (హి.స.)
పాకాల: తిరుపతి జిల్లాలోని అటవీప్రాంతంలో బయటపడ్డ మృతదేహాల కేసులో మిస్టరీ వీడలేదు. మహిళ, పురుషుడి మృతదేహాలకు శవ పరీక్ష నిర్వహించి పోలీసులు అక్కడే ఖననం చేశారు. మృతదేహాల పోస్టుమార్టం సందర్భంగా వీటిని హత్యలుగా పోలీసులు నిర్ధరించారు. గ్లౌజులు, దుస్తులు కుక్కి.. నోటికి ప్లాస్టర్ వేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు తమిళనాడులోని తంజావూర్‌కు చెందిన కలై సెల్వన్‌గా గుర్తించారు. హత్యకు గురైన మహిళ అతడి వదిన, ఆమె పిల్లలుగా భావిస్తున్నారు. ఈ ఘటనపై తంజావూర్ పోలీసులతో చంద్రగిరి, పాకాల పోలీసులు సంప్రదిస్తున్నారు. ఆస్తి కోసం జరిగిన హత్యా లేదా పరువు హత్య అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నెల 14న పాకాల మండలం గాదంకి టోల్‌ప్లాజా సమీపంలో అడవిలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. చంద్రగిరి, పాకాల మండలాల సరిహద్దుల్లో పనపాకం రక్షిత అడవిలో బాగా కుళ్లిన స్థితిలో ఇవి బయటపడ్డాయి. పశువుల కాపర్లు ఆదివారం మృతదేహాలను చూసి, పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఓ వ్యక్తి మృతదేహం చెట్టుకు వేలాడుతుండగా, పక్కనే వస్త్రం కప్పి ఉన్న మహిళ శవం ఉంది. ఆ పక్కనే మరో రెండు గోతులు తీసి పూడ్చిపెట్టిన ఆనవాళ్లూ కనిపించాయి. అందులో చిన్నారుల మృతదేహాలు ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ